భువనగిరి ఏపీవో బాలస్వామిపై చర్యలు తీసుకోవాలి..
జిల్లా కలెక్టర్‌కు ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి
భువనగిరి మండలంలో ఉపాధి హామీ పథకం (VB-GRAMG) కింద విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల ఏపీవో బాలస్వామి అసభ్య పదజాలంతో దూషిస్తూ,మానసికంగా వేధిస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం (నవంబర్ 18) జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని కోరారు.వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం..భువనగిరి మండలంలోని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించడం,కూలీలకు అందుబాటులో ఉండటం,కూలీల హాజరు నమోదు చేయడం,ఎన్ఎంఎంఎస్ (NMMS) యాప్ ద్వారా హాజరు పంపించడం వంటి విధులను ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వ్యక్తిగత, సామూహిక పనులతో పాటు బోర్వెల్ రీఛార్జ్,పశువుల నీటి తొట్టెలు, బర్రెలు,గొర్రెల షెడ్లు,ఫారం పాండ్స్ తదితర అభివృద్ధి పనుల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే విధుల నిర్వహణలో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్లను, ముఖ్యంగా మహిళా ఫీల్డ్ అసిస్టెంట్లను ఏపీవో బాలస్వామి అసభ్య పదజాలంతో దూషిస్తూ, "నీ ఇష్టం ఉంటే పని చేయ్..లేకపోతే వెళ్లిపో..నీకు ఉద్యోగం ఎందుకు దండగ" అంటూ అవమానిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వ్యవహారశైలితో తీవ్ర మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే తరహా వ్యవహారంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఏపీవో ప్రవర్తనలో మార్పు రాలేదని వారు ఆరోపించారు. సుమారు ఎనిమిదేళ్లుగా భువనగిరిలోనే విధులు నిర్వహిస్తున్న ఆయనపై గతంలోనూ ఫిర్యాదు చేసినట్లు వినతిపత్రంలో ప్రస్తావించారు. మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న అధికారిపై ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర విచారణ జరిపి తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లా కలెక్టర్‌ను కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి