యాదాద్రి భువనగిరి, నవంబర్ స్థానికం ప్రతినిధి
క్యాన్సర్.. ఈ పేరు వినగానే చాలామందిలో ఆందోళన మొదలవుతుంది. ఈ వ్యాధి వస్తే జీవితమే ముగిసిపోయినట్లుగా భావిస్తుంటారు. అయితే అది నిజం కాదని, ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులోకి రావడంతో క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాలు పెరిగాయని యశోద ఆసుపత్రి ఆంకాలజిస్ట్ డా. సోమ శ్రీకాంత్ తెలిపారు. వ్యాధిని తొలిదశలో గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని స్పష్టం చేశారు.
అవగాహన కల్పించేందుకే సదస్సు
క్యాన్సర్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, ఆధునిక చికిత్సా విధానాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సంకల్ప్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. సోమ శ్రీకాంత్ క్యాన్సర్‌కు సంబంధించిన పలు అంశాలను వివరించారు.
జీవనశైలితో పెరుగుతున్న ముప్పు
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పొగాకు వినియోగం, మద్యపానం వంటి అంశాలు క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడంతో పాటు అనుమానాస్పద లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
అధునాతన చికిత్సలతో కొత్త ఆశలు
ప్రస్తుతం రోబోటిక్ క్యాన్సర్ సర్జరీ, లాపరోస్కోపిక్ విధానాలతో అతి తక్కువ కోతల ద్వారా సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎంఆర్-లినాక్ ఆధునిక రేడియేషన్ చికిత్స ద్వారా కణితులపై మరింత కచ్చితత్వంతో చికిత్స అందించే అవకాశం ఉందన్నారు. ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, జన్యు పరీక్షలు (ఎన్‌జీఎస్), కార్-టి సెల్ థెరపీ వంటి ఆధునిక విధానాలు క్యాన్సర్ చికిత్సలో కీలకంగా మారుతున్నాయని తెలిపారు.
మహిళలు అప్రమత్తంగా ఉండాలి
మహిళల్లో ఎక్కువగా కనిపించే రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించేందుకు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు.
మానసిక ధైర్యం ఎంతో ముఖ్యం
క్యాన్సర్ బాధితులకు వైద్య చికిత్సతో పాటు మానసిక స్థైర్యం, కౌన్సెలింగ్, పౌష్టికాహారం కూడా అవసరమని వైద్యులు పేర్కొన్నారు. వ్యాధిపై భయపడకుండా, అపోహలకు దూరంగా ఉంటూ సరైన సమయంలో నిపుణులను సంప్రదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని యశోద ఆసుపత్రి ప్రతినిధులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వైద్య సిబ్బంది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి