కూలీ పనులు మానుకొని నీటి కోసం పడిగాపులు.. పట్టించుకోని అధికారులు.
చిట్యాల మున్సిపాలిటీ ఆరో వార్డు పరిధిలోని వెంకటాపురం గ్రామంలో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజులుగా గ్రామంలో తాగునీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు బిందెలు పట్టుకొని నీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి మోసుకురావాల్సిన దుస్థితి నెలకొంది.
తాగునీరు ఎప్పుడు వస్తుందో, ఏ సమయంలో సరఫరా చేస్తారో తెలియని పరిస్థితి ఉండటంతో కూలీ పనులకు వెళ్లే వారు సైతం పనులు మానుకొని నీటి కోసం ఇంటి వద్దే ఎదురుచూడాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రోజువారీ కూలీ పనులు కోల్పోతుండగా, మరోవైపు బిందెలతో నీటిని మోసుకురావాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంకటాపురం గ్రామంలో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ప్రతిరోజూ నిర్ణీత సమయానికి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి