ప్రజలు అపోహలు వీడి,అవగాహన పెంచుకోవాలి...
ఆంకాలజిస్ట్ డాక్టర్ సోమ శ్రీకాంత్
క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి,ముందస్తు గుర్తింపు మరియు ఆధునిక చికిత్సా విధానాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సంకల్ప్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేకంగా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో ఆసుపత్రికి చెందిన ప్రముఖ మెడికల్,సర్జికల్ మరియు రేడియేషన్ ఆంకాలజీ నిపుణులు డాక్టర్ సోమ శ్రీకాంత్ పాల్గొని క్యాన్సర్ నివారణ మార్గాలను వివరించారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా పూర్తిస్థాయిలో నయం చేసే అవకాశాలు మెరుగవుతాయని వైద్యులు స్పష్టం చేశారు. మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్లు,పొగాకు మరియు మద్యం వినియోగం క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అధునాతన వైద్య సాంకేతికతతో క్యాన్సర్‌పై విజయం సాధించడం సాధ్యమేనని యశోద యాజమాన్యం పేర్కొంది. ముఖ్యంగా రోబోటిక్ క్యాన్సర్ సర్జరీ,లాపరోస్కోపిక్ విధానాల ద్వారా అతితక్కువ ధరలతో సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల రోగులు త్వరగా కోలుకోవడంతో పాటు,శరీర భాగాలను కోల్పోతామనే భయం కూడా తొలగిపోతుందని వైద్యులు వివరించారు. రేడియేషన్ చికిత్సలో భాగంగా ఎంఆర్-లినక్ (ఎం.ఆర్-లింక్) వంటి కచ్చితమైన పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా కణితులపైనే నేరుగా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.అలాగే ఇమ్యునోథెరపీ,టార్గెటెడ్ థెరపీ,జన్యు పరీక్షలు (ఎన్.జి.ఎస్) మరియు కార్-టి సెల్ (సిఏఆర్-టి.సీల్)థెరపీ వంటి విప్లవాత్మక చికిత్సలు రోగులకు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయని తెలిపారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే రొమ్ము మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నివారణకు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. యువతలో హెచ్పివి (హెచ్.పి.వి) వ్యాక్సినేషన్ ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని నిపుణులు తెలియజేశారు. క్యాన్సర్ రోగులకు కేవలం వైద్య చికిత్స మాత్రమే కాకుండా,మానసిక స్థైర్యాన్ని నింపే కౌన్సెలింగ్,పౌష్టికాహార సలహాలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమాజంలో క్యాన్సర్ పట్ల భయాన్ని వీడి,ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణులను సంప్రదించాలని పిలుపునిచ్చారు. ప్రజాఆరోగ్య పరిరక్షణలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు మరియు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని యశోద ఆసుపత్రి ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైద్యులు,ఆరోగ్య కార్యకర్తలు మరియు సాధారణ ప్రజలు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి