నార్కట్‌పల్లి: జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) ఆధ్వర్యంలో శుక్రవారం నార్కట్‌పల్లిలో నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని గ్రామ గ్రంథాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పత్రికేయుల భద్రతకు జాతీయ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రద్దయిన వర్కింగ్ జర్నలిస్టు చట్టాల కింద ఉన్న చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించడంతో పాటు కొత్త వేజ్‌బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు నల్గొండ నగరంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు జారీ చేసి క్యాష్‌లెస్ వైద్యసేవలు అందించాలని సీనియర్ జర్నలిస్ట్ దేవరశెట్టి నారాయణ కోరారు. జర్నలిస్టుల సమస్యలపై ఐక్యంగా పోరాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరంతరం కృషి చేస్తామని జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు శివశంకర్ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి గర్థస్ వెంకన్న, భాశెట్టి శ్రీనివాస్, ప్రజ్ఞాపూరం కృష్ణ, పల్లె తిరుమల్, బండారు రాంబాబు, దుబ్బాక నరేష్, రాధారపు రమేష్, కన్నెబోయిన నర్సింహా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సోమ వెంకట్‌రెడ్డి, శిరిశెట్టి సంతోష్, మంద శివ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి