ఏడాది గడిచినా తొలగని శివనేనిగూడెం డంపింగ్ యార్డ్.. మరో జవహర్‌నగర్‌గా మారుతుందా?
చిట్యాల: మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు శివనేనిగూడెం ప్రజలు ఎమ్మెల్యే వేముల వీరేశంను ప్రశ్నిస్తున్నారు. గ్రామ సమీపంలోని డంపింగ్ యార్డ్‌ను తొలగిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డంపింగ్ యార్డ్‌ను తొలగించకపోగా, మున్సిపాలిటీలోని 12 వార్డుల చెత్తను అక్కడే వేస్తుండటంతో చెత్త గుట్టలుగా పేరుకుపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన, పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే శివనేనిగూడెం మరో జవహర్‌నగర్‌గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డంపింగ్ యార్డ్ సమస్యపై గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, గ్రామస్థులు పలుమార్లు ఆందోళనలు నిర్వహించి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం ఎమ్మెల్యే వేముల వీరేశం స్వయంగా డంపింగ్ యార్డ్‌ను పరిశీలించి మూడు రోజుల్లో తొలగిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఆ హామీ అమలుకు నోచుకోలేదని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రుద్రవరం లింగస్వామి విమర్శించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ప్రజల ఆరోగ్యాన్ని, పరిసర రైతుల ప్రయోజనాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే డంపింగ్ యార్డ్‌ను తొలగించకపోతే గ్రామస్థులతో కలిసి మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్, స్థానిక యువకులు రుద్రవరం మధు, రుద్రవరం రవీందర్, రుద్రవరం నాగరాజు, రుద్రవరం శ్రీకాంత్, బోయ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి