రామన్నపేట, నవంబర్ 7 (స్థానికం ప్రతినిధి):
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నేషనల్ అవార్డు–2026కు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన దళితరత్న యువజన సంఘం అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటేష్ ఎంపికయ్యారు. ఈ మేరకు జాతీయ అవార్డు కమిటీ ఆయన ఎంపికను ప్రకటించింది. హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అవార్డు ఆహ్వాన పత్రాన్ని అవార్డు సెలక్షన్ కమిటీ జాతీయ చైర్మన్, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ ఆయనకు అందజేశారు.
ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సాహిత్యాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో బహుజన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ప్రజా ఉద్యమకారులు, సంఘసేవకులు, రచయితలు, కవులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు జాతీయ స్థాయి అవార్డులను అందజేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా 2026 సంవత్సరానికి వడ్డేపల్లి వెంకటేష్‌ను డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
నవంబర్ 15న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్న బహుజన సాహిత్య అకాడమీ 20వ జాతీయ మహాసభల సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు దేశంలోని 28 రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
అవార్డు ఆహ్వాన పత్రం అందజేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు టేకి రాజశేఖర్, కనుకుంట్ల విజయ్ కుమార్, అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యుడు బి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి