ఐదు డిమాండ్లపై తీర్మానం.. పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం
తుర్కయాంజాల్, అక్టోబర్ 2: ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కులను పరిరక్షించి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ ఆధ్వర్యంలో తుర్కయాంజాల్‌లో శుక్రవారం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి ఐదు ప్రధాన డిమాండ్లతో తీర్మానం చేశారు. ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి తీసుకోవాలని, అర్హత కలిగిన ఆరోగ్యమిత్రులకు టీమ్ లీడర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు.
రూ.5 వేల రవాణా భత్యం
ఆరోగ్యమిత్రులకు ప్రతి నెలా రూ.5 వేల రవాణా భత్యం చెల్లించాలని, ఉద్యోగులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఆరోగ్యమిత్రుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు.
ప్రభుత్వం స్పందించాలి
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని యూనియన్ నాయకులు కోరారు. సమస్యలను పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు కామ్రేడ్ భూపాల్, రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య, ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి