యాదగిరిగుట్ట, అక్టోబర్ 1: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
అంతకుముందు గ్రామంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అయిలయ్య.. అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు తదితర సౌకర్యాలను దశలవారీగా మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అయిలయ్య తెలిపారు. రేషన్ కార్డులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో కీలకమని, అర్హత ఉన్నప్పటికీ కార్డులు లేని కుటుంబాలను గుర్తించి వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులతోపాటు వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
పెద్దకందుకూరులో నిర్మించిన సీసీ రోడ్లతో ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయని, వర్షాకాలంలో ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి దశలవారీగా పూర్తి చేస్తామని అన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ గుండ్లపల్లి మంగమ్మ వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాళ్లే నర్సింహాలు, యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మన్ శ్రీశైలం, వంగపల్లి పీఏసీఎస్ చైర్మన్ సుబ్రహ్మణ్యం, మాజీ సర్పంచ్ సీస మనోహర్ గౌడ్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాళ్లే లత నర్సింహాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి