చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
నల్గొండలో నిర్వహిస్తున్న అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభల సందర్భంగా, ఈ నెల 15న జరిగే రైతు బహిరంగ సభకు రైతులు, కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎం.డి. జహంగీర్ పిలుపునిచ్చారు. సీపీఎం చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కందాల రంగారెడ్డి స్మారక భవనంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని బీడు భూములకు సాగునీరు అందించే ప్రాజెక్టుల పూర్తి కోసం, పోడు భూములకు పట్టాలు, కౌలు రైతులకు న్యాయం, పంట రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా తదితర సమస్యలపై రైతు సంఘం దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలు సాగిస్తోందని తెలిపారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను ఉద్యమాల ద్వారా రద్దు చేయించిన ఘనత రైతు సంఘానిదేనని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్రం చేసుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, వ్యవసాయ రంగ రక్షణకు నిరంతర పోరాటాలు అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ సొరంగ పనులను సత్వరమే పూర్తి చేయాలని, డిండి ఎత్తిపోతల పథకం ద్వారా దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు సాగునీరు అందించాలని, మూసీ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఎం చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి గోశిక కరుణాకర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.డి. పాషా, బండారు నరసింహ, దండా అరుణ్‌కుమార్, ఆకుల ధర్మయ్య, నాయకులు బత్తుల దాసు, ఊష్కాగుల శ్రీనివాస్, ఊష్కాగుల రమేష్, తోర్పునూరి మల్లేశం, సప్పిడి శ్రీనివాసరెడ్డి, బొడ్డు రాజు, ఆర్టీవో పాషా, కందగట్ల ఆనంద్, ఎం.డి. రేష్మ, గుణముని అయిలయ్య, కలకుంట శివ, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి