మునగాల మండలం మాధవరం గ్రామంలోని గంగమ్మ గుడి సమీపంలో గురువారం గొర్రెలు మేపుతుండగా విషపూరిత గడ్డి తిని 13 గొర్రెలు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.గొర్రెలు అకస్మాత్తుగా వణుకుతూ, కాళ్లు, మెడ భాగాలు బిగుసుకుపోవడంతో పాటు కడుపు ఉబ్బరానికి గురై మృతి చెందాయి.ఈ ఘటనలో దాసరి లింగాణికి చెందిన 3 గొర్రెలు, దాసరి బాధ్యయ్యకు చెందిన 5 గొర్రెలు, దాసరి సైదులుకు చెందిన 3 గొర్రెలు, కొత్తపర్లి లింగయ్యకు చెందిన 2 గొర్రెలు మృతి చెందాయి. మొత్తం 13 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.సమాచారం అందుకున్న పశువైద్యాధికారి డాక్టర్ ఈ. భాస్కర్, పశుసంవర్ధక సహాయకుడు పి. నరసింహారావు, గోపాలమిత్రులు డి. సతీష్, ఎం. సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని అనారోగ్యానికి గురైన సుమారు 25 గొర్రెలకు చికిత్స అందించారు. ప్రస్తుతం వాటి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు. రసాయనాలతో కలుషితమైన గడ్డిని తినడం వల్ల గొర్రెలు మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
గొర్రెల మృతితో పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి