ఎండిన పంటలకు పరిహారం చెల్లించాలి!
రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి
నల్గొండ: నీటి కొరతతో ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని, రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని కోరారు.
రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా నల్గొండ మండలం జీకే అన్నారం గ్రామంలో రైతులతో కలిసి ఎండిపోయిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ రెవెన్యూ పరిధిలో వందల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీరందక ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు చేతికందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
గతంలో ఎకరాకు ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేదని, ఈసారి క్వింటా నుంచి క్వింటాన్నర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
యాసంగి పంట సాగు చేసేందుకు రైతులుసెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలు సమర్పించాలనే నిబంధనలను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సమగ్ర పంట నష్టం సర్వే నిర్వహించి, నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి ఎకరాకు రూ.40 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయడంతోపాటు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందించాలని విజ్ఞప్తి చేశారు.
రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, భవిష్యత్తులో సాగునీటి సమస్య తలెత్తకుండా పిల్ల కాలువల ద్వారా గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూములను కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు కొండ వెంకన్న, భక్తుల వెంకన్నతోపాటు రైతులు దుబ్బాక మల్లయ్య, పేర్ల నాగయ్య, బొప్పన యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి