వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ కోరారు. ఎలినినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్బీనగర్‌లోని బీసీ భవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో అనేక మంది రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారని తెలిపారు. బోర్లపై ఆధారపడి సాగు చేసుకునే రైతులు సైతం ప్రభుత్వ సూచనలతో అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులు పంటలు పండించుకోలేని పరిస్థితి వస్తే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆందోళన చెందుతున్నారని అన్నారు.
పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు రైతులకు భారంగా మారుతున్నాయని తెలిపారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుల కష్టాలను గుర్తించి వారికి అండగా నిలవాలని కోరారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించకపోతే వారు తీవ్ర నిరాశకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు డాక్టర్ అవ్వారు వేణు, బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్న శ్రీరాములు, బీసీఎఫ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి