విద్యార్థులకు బాలల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో రామన్నపేటలోని సాధన హైస్కూల్‌లో పోక్సో (POCSO) చట్టంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌ను గుర్తించడం, ఆపద సమయంలో చట్టపరమైన సహాయం పొందడం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటంపై విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమానికి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎస్‌కే ఆరిఫ్, భరోసా సెంటర్ ఎస్‌ఐ సంధ్య, ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ యుగేందర్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎస్. సాయి శ్రీనివాస్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి అనంతలక్ష్మి, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రతినిధి దశరథ హాజరయ్యారు. పాఠశాల కరస్పాండెంట్ జిట్టా ధనాపరెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జడ్జి ఎస్‌కే ఆరిఫ్ మాట్లాడుతూ బాలలకు చట్టపరమైన రక్షణలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భరోసా సెంటర్ ఎస్‌ఐ సంధ్య గుడ్ టచ్–బ్యాడ్ టచ్ మధ్య తేడాలను వివరిస్తూ డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించారు. ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ యుగేందర్ మానవ అక్రమ రవాణా, ఆన్‌లైన్ గేమింగ్ ప్రలోభాలు, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తత, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై వివరించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి అనంతలక్ష్మి బాలల సహాయం కోసం 1098 హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
పాఠశాల కరస్పాండెంట్ జిట్టా ధనాపరెడ్డి మాట్లాడుతూ పోక్సో చట్టం–2012పై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించడమే సదస్సు ఉద్దేశమని తెలిపారు. పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థినులు అఫ్షీన్ ప్రథమ, అర్చన ద్వితీయ, ఆలియా తృతీయ బహుమతులు అందుకున్నారు.
కార్యక్రమం ముగింపులో అడ్వకేట్ మల్లేష్ వందన సమర్పణ చేశారు. సదస్సు విజయవంతానికి సహకరించిన న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, బాలల పరిరక్షణ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి