అధిష్ఠానం వాస్తవాలను గ్రహించాలి: డీసీసీ కార్యదర్శి చింతల సాయిలు
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అది కాంగ్రెస్ పార్టీకే నష్టం కలిగిస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యదర్శి చింతల సాయిలు పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రాజగోపాల్‌రెడ్డి ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని పార్టీ అధిష్ఠానం గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల నియోజకవర్గాలే కాకుండా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే మాట్లాడారని, అందులో వ్యక్తిగత విమర్శలు లేవని సాయిలు వివరించారు. 2029లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నా, రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు.గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసిన చరిత్ర రాజగోపాల్‌రెడ్డిదని గుర్తు చేశారు. ఆపదలో ఉన్నవారికి వైద్య సాయం అందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఆయనకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించాలని ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వాన్ని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజగోపాల్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అనుచరులమంతా ఆయన వెంటే నడుస్తామని సాయిలు స్పష్టం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి