మొదటి, రెండో అప్పీళ్ల ద్వారా చట్టబద్ధంగా పోరాడాలి.
హైదరాబాద్, నవంబర్ 22 (స్థానికం):
సమాచార హక్కు చట్టం–2005 కింద కోరిన సమాచారాన్ని వ్యక్తిగత వివరాల పేరుతో పూర్తిగా నిరాకరించకుండా, చట్టంలోని నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని ఆర్టిఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్టీఐ సతీష్ సూచించారు. సమాచారం నిరాకరణకు గురైనప్పుడు సెక్షన్ 10(1), 8(2)లను ఆధారంగా చేసుకుని చట్టబద్ధంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం–2023లోని సెక్షన్ 44(3) ద్వారా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)(j)లో సవరణ జరిగిందని, ఈ మార్పు 2025 నవంబర్ 13 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. సవరించిన నిబంధనల ప్రకారం వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించకుండా మినహాయించే అవకాశం ఉందన్నారు.
అయితే, ఒక రికార్డులో వ్యక్తిగత సమాచారం ఉందనే కారణంతో మొత్తం సమాచారాన్ని నిరాకరించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. సెక్షన్ 10(1) ప్రకారం మినహాయింపుకు గురయ్యే వ్యక్తిగత వివరాలను తొలగించి, మిగిలిన సమాచారాన్ని అందించే అవకాశం ఉందని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, ఎంపిక ప్రక్రియలు, పరీక్షల ఫలితాలు, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన రికార్డుల్లో ఈ నిబంధన ప్రాధాన్యతను వివరించారు.
అలాగే సెక్షన్ 8(2) ప్రకారం సమాచారాన్ని వెల్లడించడం వల్ల కలిగే ప్రజాప్రయోజనం, రక్షించాల్సిన ప్రయోజనాలకు కలిగే హానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు సమాచారాన్ని వెల్లడించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజాప్రయోజనానికి సంబంధించిన సమాచారాన్ని కోరినప్పుడు ఈ నిబంధనను కూడా అప్పీళ్లలో ప్రస్తావించాలని సూచించారు.
ప్రజా సమాచార అధికారి సమాచారం నిరాకరిస్తే సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్పీల్ దాఖలు చేయాలని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే సెక్షన్ 19(3) ప్రకారం రెండో అప్పీల్ ద్వారా సమాచార కమిషన్‌ను ఆశ్రయించాలని కోరారు. అప్పీళ్లలో సంబంధిత చట్ట నిబంధనలను ప్రస్తావిస్తూ తమ వాదనలను బలంగా వినిపించాలన్నారు.ఆర్టిఐ రక్షక్
కార్యకర్తలు కేవలం దరఖాస్తులకే పరిమితం కాకుండా చట్టంలోని ప్రతి సెక్షన్‌పై అవగాహన పెంచుకోవాలని ఆర్టీఐ సతీష్ సూచించారు. ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలనే ఆర్టిఐ రక్షక్ సంస్థ ప్రధాన లక్ష్యాలని తెలిపారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి