కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఫొటోగ్రాఫర్ కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి తన ఉదారతను చాటుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అర్థ వెంకట్‌రెడ్డి. కిడ్నీ వ్యాధితో పోరాడుతున్న పేద ఫొటోగ్రాఫర్ కుటుంబానికి రూ.15 వేల విలువైన నిత్యావసర సరుకులు అందజేసి ఆపన్నహస్తం అందించారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ ఇటుకమల్ల మహేందర్ గత కొంతకాలంగా కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. విధి వక్రీకరించడంతో ఆయన సతీమణి సైతం ఇదే వ్యాధి బారిన పడ్డారు. భార్యాభర్తలిద్దరూ అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో వారి ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు, కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ దీనస్థితి గురించి తెలుసుకున్న అర్థ వెంకట్‌రెడ్డి ఆదివారం బాధితుడి ఇంటికి వెళ్లి వారిని ఓదార్చారు. కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన తక్షణ సాయంగా రూ.15 వేల విలువ చేసే నిత్యావసర సరుకులను అందజేశారు.ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న మహేందర్ కుటుంబానికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతావాదులు, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించాలని పిలుపునిచ్చారు. ఆపద సమయంలో ఆదుకున్న వెంకట్‌రెడ్డికి బాధిత కుటుంబం కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ రావుల స్వామి, మాజీ కౌన్సిలర్ బత్తుల విజయలక్ష్మి బాలరాజు గౌడ్, జిల్లా కార్యదర్శి బత్తుల లింగస్వామి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి ఇప్ప వెంకటేశం, మున్సిపల్ అధికార ప్రతినిధి శామకూర యాదయ్య, సీనియర్ నాయకులు బాబు, 15వ వార్డు అధ్యక్షుడు ఉదయ్ సురేష్, ఎస్సీ సెల్ మున్సిపల్ అధ్యక్షుడు బొజ్జ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి