పట్టభద్రుల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బి.స్మాట్) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, మహర్షి స్కూల్స్ కరస్పాండెంట్ కొండూరి మల్లేష్ గౌడ్ అన్నారు. తెలంగాణలో జరగనున్న నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు పాఠశాలలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులతో సమావేశం నిర్వహించి ఓటరు నమోదు ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగుల ఇబ్బందులు, విద్యావంతుల హక్కులు శాసనమండలిలో ప్రతిధ్వనించాలంటే ఓటరు నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
ఓటుతోనే గళం వినిపించే అవకాశం
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతుల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ పట్టభద్రులు ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
అర్హత ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోకపోతే తమ హక్కును కోల్పోయే అవకాశం ఉందని, అందువల్ల నిర్ణీత గడువులోగా ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యావంతుల ఐక్యతతోనే పట్టభద్రుల సమస్యలపై బలమైన పోరాటం సాధ్యమవుతుందని కొండూరి మల్లేష్ గౌడ్ స్పష్టం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి