విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల సమావేశం.
ఆధునిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ ర్యాకల సంతోష, శ్రీనివాస్.
స్థానికం ప్రతినిధి / భువనగిరి, నవంబర్ 5:
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమష్టిగా కృషి చేయాలని తాజ్పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష, శ్రీనివాస్ దంపతులు సూచించారు. భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల (ఎంపీయూపీఎస్)లో విద్యార్థుల విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు పాఠశాలలో కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్ఎస్కే ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, టీవీల ద్వారా ఆన్లైన్ విద్య విద్యార్థుల అభ్యసనకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యలో రాణించాలని ఆకాంక్షించారు.
పిల్లల చదువుపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం
విద్యార్థుల అభ్యున్నతిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని, పాఠశాలలో ఉపాధ్యాయులు అందించే బోధనతో పాటు ఇంటి వద్ద కూడా పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకున్నప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు.
సమావేశంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కలిసి తమ పిల్లల విద్యా ప్రగతి, అభ్యసన సామర్థ్యం, చదువులో ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల శాశ్వత దాత డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి