యువత, సాగునీరు, చేనేత హక్కులే శ్వాసగా సమరశంఖం
పార్టీలు ముందుకు రాకుంటే స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దింపుతాం: ఫౌండేషన్ అధినేత భాస్కర్
ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పీక్ స్టేజ్‌కు చేరిన వేళ ప్రముఖ సామాజిక సంస్థ ‘ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్’ సంచలన నిర్ణయాలతో రంగంలోకి దిగింది. విద్యావంతులు, నిరుద్యోగుల గొంతుకను శాసనమండలిలో బలంగా వినిపించేందుకు సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను ఫౌండేషన్ అధినేత, ప్రముఖ సామాజిక విశ్లేషకులు ఈ ఎల్ వి భాస్కర్ అధికారికంగా ప్రకటించారు. కేవలం మునుగోడుకే పరిమితం కాకుండా, రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఎజెండాకు కట్టుబడితేనే
మద్దతు.. లేదంటే సొంత అభ్యర్థి!
ప్రాంతీయ అభివృద్ధి, యువత ఉపాధి కోసం లిఖితపూర్వక హామీ ఇచ్చే పార్టీలు, అభ్యర్థులకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని భాస్కర్ తేల్చి చెప్పారు. ఒకవేళ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ డిమాండ్లకు ముందుకు రాకపోతే.. సమర్థుడైన స్వతంత్ర (ఇండిపెండెంట్) పట్టభద్రుడిని నేరుగా అభ్యర్థిగా బరిలోకి దింపుతామని హెచ్చరించారు.
ప్రధాన డిమాండ్లు, కార్యాచరణ:
రాచకొండ ఎత్తిపోతల పథకం డీపీఆర్ సాధించడంతో పాటు, శివన్నగూడెం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలి. మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లోని 4 లక్షల ఎకరాలకు స్థిరమైన ఆయకట్ట సాధించడమే ప్రధాన ధ్యేయం. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, గ్రామీణ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తాం. చేనేత కార్మికులకు శాశ్వత ఆర్థిక భరోసా కల్పించాలి. నిర్లక్ష్యానికి గురైన రాచకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ, ప్రభుత్వ ఆధ్వర్యంలో 'రాచకొండ దసరా ఉత్సవాలను' భారీ ఎత్తున అధికారికంగా నిర్వహించాలి.
ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రానున్న 3 నెలల పాటు మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటించనున్నట్లు భాస్కర్ తెలిపారు. క్షేత్రస్థాయి సమస్యలతో ‘ప్రజా మేనిఫెస్టో’ రూపొందిస్తామని, తమ డిమాండ్లకు కట్టుబడే వారికే మద్దతిచ్చి.. లేదంటే స్వతంత్ర అభ్యర్థితో ఎన్నికల్లో 'కింగ్ మేకర్'గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి