యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 21 (స్థానికం):
రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి. పాటిల్ ఐఏఎస్ సూచించారు. భూగర్భ జలాల పరిరక్షణతో పాటు విద్యుత్ ఆదా చేయడానికి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, చినరావులపల్లి, బట్టుగూడెం, వలిగొండ మండలంలోని మందాపురం గ్రామాలను సీఎండీ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వ్యవసాయ రంగంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని రైతులకు సూచించారు. మునగ, వివిధ రకాల కూరగాయలను సాగు చేయడంతో పాటు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని తెలిపారు. వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ, మేకల పెంపకం వంటి ఉపాధి మార్గాలను ఎంచుకుని అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు.
సంప్రదాయ వరి సాగుతో పోలిస్తే వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటల ద్వారా తక్కువ వనరులతో మెరుగైన ఆదాయం పొందే అవకాశాలున్నాయని జితేశ్ వి. పాటిల్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో భూగర్భ జలాల వినియోగం తగ్గడమే కాకుండా వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని కూడా ఆదా చేయవచ్చన్నారు. నీటి వనరులను పరిరక్షిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఈ విధానం దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్. నరసింహులు, సీఈ (రూరల్ జోన్) యు. బాలస్వామి, యాదాద్రి ఎస్‌ఈ కె. సురేశ్‌కుమార్, భువనగిరి ఆపరేషన్స్ డీఈ ఎస్. వెంకటేశ్వర్లు, డీఈ విజయభాస్కర్‌రెడ్డి, ఏడీఈ వి. మచ్చేందర్, ఏఈ డి. మనోహర్‌రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి