యథేచ్ఛగా తవ్వకాలు అడ్డూఅదుపూ లేని తరలింపులు!
కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు...
భూగర్భ జలాలపై ప్రభావంతో రైతుల్లో ఆందోళన...
నల్గొండ జిల్లా బ్యూరో : నల్గొండ కార్పొరేషన్ పరిధి 13, 14, డివిజన్లలో విస్తరించి ఉన్న ఎర్రకుంట కేంద్రంగా మట్టి తవ్వకాలు, తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కుంట పరిధిలో అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయా? ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి మట్టిని తరలిస్తున్నారా? ఈ తవ్వకాల వెనుక ఎవరున్నారు? అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు ఉంది? అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. కుంటలో భారీగా మట్టిని తవ్వి తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, సంబంధిత శాఖల అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతున్నారని సమాచారం.
రెండు నెలలుగా తవ్వకాలు?
స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రకుంట పరిధిలో కొంతకాలంగా మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నట్లు, భారీ యంత్రాలు, టిప్పర్లను వినియోగిస్తూ మట్టిని బయటకు తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజూ పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో కుంట స్వరూపం మారిపోతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తవ్వకాలకు సంబంధించి ఎంతమేర అనుమతులు మంజూరయ్యాయి? అనుమతించిన పరిమాణం ఎంత? వాస్తవంగా ఎంత మట్టిని తవ్వి తరలించారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. సంబంధిత రికార్డులు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగానే ఈ వ్యవహారంపై వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
కోట్ల రూపాయల ఆదాయం ఎవరి జేబుల్లోకి?
కుంటలోని మట్టిని తరలించడం ద్వారా భారీగా ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తవ్విన మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు? ఏయే నిర్మాణ పనులకు వినియోగిస్తున్నారు? రవాణాకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? మట్టి విక్రయాలు జరుగుతుంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎంత? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయా లేదా అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. తవ్వకాల పరిమాణం, రవాణా వివరాలు, అనుమతులు, ప్రభుత్వానికి చెల్లించిన రుసుములను పరిశీలిస్తేనే అసలు లెక్క తేలనుంది. మట్టి తరలింపు వెనుక ఉన్న వ్యక్తులు, వాహనాల యజమానులు, అనుమతులు మంజూరు చేసిన శాఖల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భూగర్భ జలాలపై ప్రభావం...
చెరువులు, కుంటలు గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వకు, భూగర్భ జలాల పెరుగుదలకు కీలకంగా ఉంటాయి. ఇలాంటి జలవనరుల్లో అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా లోతైన తవ్వకాలు జరిగితే పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాన్ని విస్మరించలేం. చుట్టుపక్కల వ్యవసాయ భూములు, బోర్లు, బావులపై ప్రభావం పడే అవకాశాలున్నాయా? అనే విషయాన్ని నిపుణులు, సంబంధిత అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నీటి వనరులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ...
కుంట పరిధిలో తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రెవెన్యూ, నీటిపారుదల, మైనింగ్ తదితర సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలనే డిమాండ్ వినిపిస్తోంది. తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? నిబంధనల మేరకే పనులు సాగుతున్నాయా? మట్టి తరలింపునకు సంబంధించి రవాణా పత్రాలు, ఇతర అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై సమగ్ర తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూమి లేదా జలవనరుల పరిధిలో అక్రమ తవ్వకాలు జరిగినట్లు నిర్ధారణ అయితే నష్టాన్ని అంచనా వేసి, నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు తగిన చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు.