మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
విద్యార్థులు డ్రగ్స్, గంజాయి, మద్యపానం, ధూమపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని జూనియర్ సివిల్ జడ్జి గౌస్ పాషా సూచించారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం చౌటుప్పల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల వినియోగం, దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం లేదా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం పాఠశాల వంటశాలను పరిశీలించి, మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పోషక విలువలున్న ఆహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు.కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు పరమేష్, చౌటుప్పల్ ఎస్సై అజయ్ భార్గవ్, జాయింట్ సెక్రటరీ మక్తాల నరసింహ, సభ్యుడు ఖయ్యూం పాషా, సీనియర్ న్యాయవాదులు ఏలమోని శ్రీనివాస్, తడక మోహన్, జెల్లా రమేష్, డీఎల్‌ఎస్‌ఏ సభ్యుడు మహమ్మద్ పాషా, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి