వెలిమినేడులో DYFI, SFI ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి.
కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని DYFI తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో DYFI, SFI ఆధ్వర్యంలో నిర్వహించిన ఫూలే 136వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మల్లం మహేష్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించి సామాజిక న్యాయం కోసం ఫూలే ఉద్యమించారని తెలిపారు. మహిళలకు విద్య అందించాలనే సంకల్పంతో తన జీవిత భాగస్వామి సావిత్రిబాయి ఫూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళా విద్యకు బాటలు వేశారని పేర్కొన్నారు. మహిళల హక్కులు, వితంతువుల సంక్షేమం కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
నేటికీ సమాజంలో కులవివక్ష, అసమానతలు కొనసాగుతుండటం ఆందోళనకరమని, ఫూలే ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత యువత, విద్యార్థులపై ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన విద్య, సమాన అవకాశాలు, ఆత్మగౌరవం కల్పించే సమాజ నిర్మాణం కోసం యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఫూలే ఆశయ సాధనకు DYFI, SFI నిరంతరం కృషి చేస్తాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో DYFI మండల కార్యదర్శి కూనూరు గణేష్, SFI నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు అరూరి ప్రణీత్, నాయకులు అరూరి నర్సింహా, గోలి సాయిరాం, అరూరి పవన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి