కూచిపూడి గ్రామ పంచాయతీకి ఏ ఎన్నికలు జరిగినా, ప్రజలు సర్పంచ్‌ను ఎన్నుకుంటే పాలన మాత్రం వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్తలు నడిపించే సంస్కృతి గ్రామాల్లో రోజురోజుకూ హెచ్చిపోతోంది. తాజాగా మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో సర్పంచ్ భర్త ఆగడాలు శృతి మించిపోయాయని, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా మారాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సొంత పనులకు పంచాయతీ సిబ్బంది: కూచిపూడి గ్రామ సర్పంచ్ భర్త కాసాని వెంకటేశ్వర్లు గ్రామ పంచాయతీ పరిధిలో అంతా ‘నా ఇష్టం’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ పారిశుధ్య పనులకు, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాల్సిన పంచాయతీ సిబ్బందిని తన వ్యక్తిగత కాంట్రాక్ట్ పనులకు వినియోగించుకుంటున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ ఉద్యోగులతో సొంత పనులు చేయిస్తుండటంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ప్రశ్నిస్తే పొంతన లేని, అడ్డగోలు సమాధానాలు చెబుతూ సర్పంచ్ భర్తను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు.
అటకెక్కిన పారిశుధ్యం – నిద్రపోతున్న పాలకవర్గం: ఇటీవల సంభవించిన తుఫాన్ ప్రభావంతో గ్రామంలో చెత్తాచెదారం పేరుకుపోయి, డ్రెయిన్లలో పూడిక తీయక పారిశుధ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నప్పటికీ, గ్రామంలో పారిశుధ్య పనులను పూర్తిగా అటకెక్కించారు. గ్రామాన్ని సుందరంగా, పరిశుభ్రంగా ఉంచాల్సిన పాలకవర్గం దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గ్రామ సర్పంచ్ స్థానికంగా అందుబాటులో ఉండకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ జాడ లేకపోవడంతో ఆమె భర్త గ్రామ పంచాయతీ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పెత్తనం చెలాయిస్తున్నారని వార్డు సభ్యులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల మౌనం – పలు ప్రశ్నలకు తావు: సర్పంచ్ భర్త ఆగడాలు, నిబంధనల ఉల్లంఘనపై గ్రామస్థులు సంబంధిత మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పంచాయతీ సిబ్బంది యథేచ్ఛగా సర్పంచ్ భర్త కాంట్రాక్ట్ పనుల్లోనే నిమగ్నం కావడంపై అధికారుల పర్యవేక్షణ లోపాన్ని వేలెత్తి చూపుతోంది. అధికారుల మౌనం వెనుక ఉన్న రహస్యమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గతంలో కూడా సర్పంచ్ భర్త పంచాయతీ నిధులను, అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ పలువురు వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో సర్పంచ్ భర్త ఆగడాలకు అడ్డులేకుండా పోయిందని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కూచిపూడి గ్రామంలో విచారణ జరిపించాలని, కాంట్రాక్ట్ పనులకు పంచాయతీ సిబ్బందిని వాడుకుంటున్న సర్పంచ్ భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అలాగే పారిశుధ్య పనులను యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరించాలని కూచిపూడి ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి