కోదాడ నియోజకవర్గంలో చేపట్టిన రహదారులు, వంతెనలు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నూతన రహదారుల నిర్మాణానికి రూ.52 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సూచించారు.
అనంతగిరిలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, కోదాడలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, డివిజన్ కార్యాలయాల పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. అలాగే షాదీఖానా, ఈద్గా, న్యాక్ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి