ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో జర్నలిస్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి
టీజేఏ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్
యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో జర్నలిస్టులకు కూడా అవకాశం కల్పించి, వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మొహమ్మద్ షానూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎస్వి కాన్ఫరెన్స్ హాల్ లో మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ జర్నలిస్టులు నిత్యం నిస్వార్థంగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల్లో చాలామందికి నేటికీ సొంత ఇళ్లు,ఇంటి స్థలాలు లేవని, అద్దె ఇళ్లలో నివసిస్తూ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సేవలను గుర్తించి ప్రభుత్వం వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి,ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వారి చిరకాల స్వప్నమైన సొంతింటి కలను ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సాకారం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న,జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ రెహమాన్,జిల్లా కార్యవర్గ సభ్యులు జి. శ్రీనివాస్,ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టు -జి.శ్రీనివాస్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి