విద్యారంగానికి ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి
హయత్‌నగర్, అక్టోబర్ 30 (స్థానికం):
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. హయత్‌నగర్ మండల కేంద్రం నుంచి కుంట్లూరుకు వెళ్లే రహదారి పక్కన ఉన్న ఎంపీపీఎస్ పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వహించిన మూస వనజ కిష్టయ్య పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ పదవీ విరమణ పొందిన మూస వనజ కిష్టయ్య దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి సమాజ నిర్మాణంలో అత్యంత గౌరవప్రదమైనదని, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి ఉన్నతికి కృషి చేయడంలో ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని అన్నారు.
మూస వనజ కిష్టయ్య తన ఉద్యోగ జీవితంలో విద్యారంగానికి అందించిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్ మాజీ ఎంఈఓ గంధం వెంకటయ్య, బాలల హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. రఘునందన్, హయత్‌నగర్ మండల ఎస్టీయూ అధ్యక్షుడు ఏడుకొండలు, ప్రధాన కార్యదర్శి పాండు, పీఆర్‌టీయూ నాయకుడు ఎన్. బాలకృష్ణ, దీన్‌దయాళ్, భానుచందర్, నోగు వీర్ల నరసింహ తదితర ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి