బాల్య వివాహాలు, బాల కార్మికత్వం నిర్మూలించాలి.
భువనగిరి, అక్టోబర్ 30 (స్థానికం):
బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని, బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాలని భువనగిరి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం. ఉషశ్రీ సూచించారు. విద్యార్థులు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.
భువనగిరిలోని మదర్ థెరిసా హైస్కూల్‌లో శుక్రవారం బాలల హక్కులు, బాల్య వివాహాలు, బాల కార్మికత్వం, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్నారులకు రక్షణ కల్పించడంతో పాటు వారికి చట్టాలపై అవగాహన కల్పించడం ద్వారా సురక్షిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్‌ఐ అజీమ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సాయి శ్రీనివాస్, భరోసా కేంద్రం ఎస్‌ఐ సంధ్య, డీసీపీయూ అధికారి దశరథ్ బాలల రక్షణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలు, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చిన్నన్ సురేష్, 8, 9, 10వ తరగతులకు చెందిన సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి