దీపావళి వేళ అప్రమత్తతే శ్రీరామరక్ష
బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పనిసరి.
అత్యవసర పరిస్థితుల్లో 108కు కాల్ చేయండి
EMRI GHS స్టేట్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ బి. సుధాకర్.
హైదరాబాద్, నవంబర్ 6: స్థానికం ప్రతినిధి
దీపాల పండుగ దీపావళి వేళ ఆనందంతో పాటు అప్రమత్తత కూడా అవసరమని EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ (EMRI GHS) – 108 అత్యవసర సేవలు సూచించాయి. బాణసంచా కాల్చే సమయంలో చిన్నపాటి అజాగ్రత్త ప్రాణాల మీదకు తెస్తుందని హెచ్చరించాయి. అగ్నిప్రమాదాలు, కాలిన గాయాలు, కంటి గాయాల బారిన పడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి.
నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు..
దీపావళి సందర్భంగా బాణసంచా పేల్చే సమయంలో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని EMRI GHS స్టేట్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ బి. సుధాకర్ తెలిపారు. టపాసులను ఇళ్లలో కాకుండా విశాలమైన బహిరంగ ప్రదేశాల్లోనే కాల్చాలని, ఇళ్లు, వాహనాలు, మండే వస్తువులకు దూరంగా ఉండాలని సూచించారు. కాటన్ దుస్తులు, పాదరక్షలు ధరించాలని, పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే బాణసంచా కాల్చాలని పేర్కొన్నారు. చేతిలో టపాసులు పట్టుకుని కాల్చడం, పేలని టపాసులను తిరిగి వెలిగించడం ప్రమాదకరమని హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తగా నీరు లేదా ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
కాలిన గాయాలైతే తక్షణ చికిత్స..
బాణసంచా కారణంగా కాలిన గాయాలు ఏర్పడితే వెంటనే సాధారణ చల్లటి ప్రవహించే నీటితో 20 నిమిషాల పాటు గాయపడిన ప్రాంతాన్ని చల్లబరచాలని తెలిపారు. ఐస్, కొబ్బరి నూనె, టూత్‌పేస్ట్ వంటి పదార్థాలను పూయకూడదని, బొబ్బలను పగలగొట్టరాదని సూచించారు. గాయపడిన ప్రాంతాన్ని శుభ్రమైన వస్త్రంతో కప్పి వెంటనే వైద్య సహాయం పొందాలని పేర్కొన్నారు.
దీపావళి రోజే 1,699 మందికి గాయాలు..
2025 సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం సాధారణ రోజుల్లో అగ్నిప్రమాదాల కారణంగా 1,766 మంది గాయపడగా, ఒక్క దీపావళి రోజునే బాణసంచా ప్రమాదాల వల్ల 1,699 మంది ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు. ఈ గణాంకాలు పండుగ వేళ భద్రతా చర్యల ఆవశ్యకతను స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
24 గంటలూ 108 సేవలు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచామని, 108 అత్యవసర సేవలు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటాయని సుధాకర్ వెల్లడించారు. అగ్నిప్రమాదాలు, కాలిన గాయాలు, కంటి గాయాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆలస్యం చేయకుండా 108కు కాల్ చేయాలని కోరారు.
చిన్నపాటి జాగ్రత్తతో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆనందంగా, సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని EMRI GHS – 108 అత్యవసర సేవలు ప్రజలకు పిలుపునిచ్చాయి.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి