కాళ్లు, చేతులు చీరతో కట్టేసి నరికివేత
రూ. 9 లక్షల నగదు, బంగారం, సఫారీ కారుతో పరార్!
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
ఇంటికి వచ్చిన వ్యక్తులే పూజారిని కాళ్లు, చేతులు చీరతో కట్టేసి దారుణంగా హత్య చేసిన సంఘటన చౌటుప్పల్ టౌన్‌లోని బీసీ కాలనీలో తీవ్ర కలకలం రేపింది. హత్య అనంతరం రూ.9 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఐఫోన్, సఫారీ కారుతో దుండగులు పరారయ్యారు.ఇన్‌స్పెక్టర్ డి.సతీష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బీసీ కాలనీకి చెందిన రాళ్లబండి సుధాకర్ స్వామి (50) దేవుడి పూజలు, కొలుపులు చెప్తూ జీవనం సాగిస్తుంటారు. శనివారం రాత్రి ఆయనను కలిసేందుకు పవన్, అతని స్నేహితుడు హర్షు అనే వ్యక్తులు వచ్చారు. అర్ధరాత్రి సమయంలో సుధాకర్ స్వామి ఫోన్ నుంచి ఆయన మేనల్లుడు గుర్రం సురేష్ వాట్సాప్‌కు మెసేజ్‌లు రావడంతో అనుమానం వచ్చి వెళ్లి చూడగా.. ఇంట్లో కారు కనిపించలేదు. లోపలికి వెళ్లేసరికి బెడ్‌రూమ్‌లో సుధాకర్ స్వామి చేతులు, కాళ్లు చీరతో కట్టేసి రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నారు.ఇంట్లోని రూ.9 లక్షల నగదు, బంగారం, వెండి, ఐఫోన్ 16 ప్రో మాక్స్ TG 30 A 5659 నంబర్ గల టాటా సఫారీ కారును అపహరించుకెళ్లారు. రాత్రి ఇంటికి వచ్చిన పవన్, హర్షులపై అనుమానం ఉందంటూ సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి