జాతీయ రహదారి 65 సమాంతరంగా సూర్యాపేట మీదుగానే కారిడార్ కొనసాగుతుందని భరోసా
సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ కొనసాగుతుందన్న ఆశలు మరోసారి చిగురించాయని బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ నాయకులు తెలిపారు. జాతీయ రహదారి 65 సమాంతరంగా సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటుపై కేంద్రం గతంలో ప్రకటించిన కేటాయింపులకు కట్టుబడి ఉంటుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మార్గం మారుతుందంటూ వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలకు తెలియకుండా బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని ఎలా మారుస్తారని ఈటల రాజేందర్ ప్రశ్నించినట్లు నాయకులు తెలిపారు. వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, అధిక జనసాంద్రత కలిగిన నగరాలను అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ మార్గం ఉంటుందని, సూర్యాపేట ప్రజలు అనవసరమైన అపోహలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చినట్లు వివరించారు. సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఇచ్చిన హామీ పట్టణ ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తించిందని కమిటీ నాయకులు పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌ను కలిసిన వారిలో బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, ధర్మార్జున్, వెలుగు వనిత, బూర వెంకటేశ్వర్లు, జర్నలిస్టు భూపతి రాములు, బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, మన్మధరెడ్డి, కడియం రామచంద్రయ్య, దండా మురళీధర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసరావు, యాదగిరి శుక్ర తదితరులు ఉన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి