వివాహేతర సంబంధంపై అనుమానంతో భర్త ఘాతుకం
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో దారుణ ఘటన.. ఇద్దరు పిల్లలతో పరారైన నిందితుడు
కన్నౌజ్: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధంపై అనుమానం పెంచుకున్న ఓ భర్త తన భార్యను కుర్చీకి కట్టేసి నిప్పంటించి హత్య చేసినట్లు సమాచారం. కన్నౌజ్ జిల్లా చిబ్రమౌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జగత్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సుఖ్బీర్ సింగ్ అలియాస్ మోను (35)కు సోనమ్‌తో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మోను హర్యానాలోని హిసార్‌లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, సోనమ్ ఇద్దరు పిల్లలతో కలిసి స్వగ్రామంలో నివసిస్తోంది. ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చిన మోను.. తన భార్య మరొకరితో ఫోన్‌లో మాట్లాడటాన్ని గమనించాడు. దీంతో ఆమెపై వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన మోను.. సోనమ్‌ను కుర్చీకి కట్టేసి నిప్పంటించినట్లు సమాచారం. అనంతరం ఇద్దరు పిల్లలను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మంటలను పూర్తిగా ఆర్పేందుకు సుమారు గంటన్నర సమయం పట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో సోనమ్ పూర్తిగా కాలిపోయి మృతిచెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపుతో పాటు దర్యాప్తు చేపట్టారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి