రైతులకు మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యం
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
మండలంలోని బాలెంల గ్రామంలో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర అందించడమే లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పత్తిని సిద్ధం చేసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని పంటకు గిట్టుబాటు ధర పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
బాలెంలలో కొనుగోళ్లు ప్రారంభం కావడంతో పరిసర గ్రామాల పత్తి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ఎండీ ఫసియోద్దీన్ ముక్రం, మండల పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు అనంతుల శ్యాంప్రసాద్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, సీసీఐ కొనుగోలుదారు అమిత్, గ్రామ సర్పంచ్ గాలి నగేష్, ఉపసర్పంచ్ బుచ్చి రాములు, మాజీ సర్పంచ్ రామసాని రమేష్, మామిడి మల్లయ్య, వార్డు సభ్యుడు సరిపెల్లి మధు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పడిదల రాము, పల్స మధు, ఇంద్రకంటి పరమేష్, షేక్ రహీం, కోడి కిరణ్, పిల్లల నాగరాజు, మిల్లుల నిర్వాహకులు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి