విజ్ఞాన్ హైస్కూల్‌లో బాలల రక్షణపై అవగాహన
బాలల హక్కులు, భద్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సురక్షిత్ బచ్పన్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా గురువారం విజ్ఞాన్ హైస్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయ, పోలీస్, బాలల పరిరక్షణ శాఖల అధికారులు విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రత, చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఆరిఫ్ హాజరయ్యారు. మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఎస్‌ఐ భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సాయి శ్రీనివాస్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి అనంతలక్ష్మి , చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రతినిధి దశరథ్ పాల్గొని విద్యార్థులకు పలు అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి బాలుడికి సురక్షితమైన బాల్యం, విద్య, గౌరవం, రక్షణ పొందే హక్కు ఉందన్నారు. బాలలపై లైంగిక వేధింపులు, శారీరక, మానసిక హింస, అక్రమ రవాణా వంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోక్సో చట్టం–2012పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, వేధించినా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
బాలల అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అనుమానాస్పద పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. బాలల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ హైస్కూల్ చైర్మన్ డా. పగిడాల జలేందర్ రెడ్డి, కరస్పాండెంట్ పగిడాల పురేందర్ రెడ్డి,ప్రిన్సిపల్ మమత,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి