ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలి
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
శాసనసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మిగతా హామీలన్నింటినీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు డిమాండ్ చేశారు. ఆదివారం చౌటుప్పల్‌లోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో యాట బాలరాజు అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్య వైఖరి వీడాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లతో పాటు, సొంత స్థలం లేని వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలన్నారు. పింఛన్ల మంజూరులో ఆంక్షలు తొలగించి, గ్రామసభల ద్వారా అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 22-ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సైదులు కోరారు. సాదా బైనామా కొనుగోళ్లు, పాత పట్టాదార్ పాస్‌బుక్కులు ఉన్న రైతులకు చట్టప్రకారం భూహక్కులు కల్పించాలన్నారు. హామీలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా ఆచరణలో చూపి పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సంఘం మండల కార్యదర్శి చింతల సుదర్శన్, జిల్లా కమిటీ సభ్యులు మానే సాలయ్య, రాపోలు పద్మ, మండల నాయకులు నేరడి మహేష్, జంగం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి