ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి అప్పుల పాలైన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారా హిల్స్‌లో నివాసం ఉంటున్న గంధమల్ల భరత్ కుమార్ (36) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత ఆరేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
బెట్టింగ్‌లో నష్టపోయి చేసిన అప్పులను తీర్చేందుకు గతంలో ప్లాట్, భూమిని విక్రయించినప్పటికీ, బెట్టింగ్‌ను మానుకోకుండా మరిన్ని అప్పులు చేసినట్లు మృతుడి భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.
గర్భిణి అయిన అతని భార్య వైద్యుల సూచన మేరకు గత రెండు నెలలుగా పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో అక్టోబర్ 26వ తేదీ తెల్లవారుజామున తన భర్త వాట్సాప్ ద్వారా తాను చనిపోతున్నట్లు సందేశం పంపినట్లు ఆమె తెలిపింది. అనంతరం భువనగిరిలోని నివాసానికి చేరుకుని చూడగా, భర్త అప్పటికే మృతి చెంది ఉన్నట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు భువనగిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. బెట్టింగ్ వ్యసనం కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. అప్పులు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలకు బదులుగా కుటుంబ సభ్యులు, నమ్మకమైన వ్యక్తులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి