అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన న్యాల్కల్ మండలం మెటల్‌కుంట గ్రామ శివారులో వెలుగుచూసింది. ఈ హత్య కేసును హద్నూర్ పోలీసులు కేవలం నాలుగు గంటల్లోనే ఛేదించి నిందితులైన భార్య భాగ్యమ్మ, ఆమె ప్రియుడు మన్నె గోపాల్‌ను అరెస్ట్ చేశారు. ఈ వివరాలను జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ వెల్లడించారు.వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం గనాపూర్ గ్రామానికి చెందిన మన్నె రమేష్ (45), భాగ్యమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామానికి చెందిన మన్నె గోపాల్ (44)కు రమేష్‌తో బంధుత్వంతో పాటు స్నేహం కూడా ఉంది. ఈ పరిచయంతో గోపాల్‌కు భాగ్యమ్మతో గత ఆరు నుంచి ఏడేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భాగ్యమ్మ, గోపాల్‌తో కలిసి రమేష్‌ను హత్య చేయాలని పథకం రచించింది. ఇందులో భాగంగా గోపాల్ ముందుగానే పదునైన కత్తిని కొనుగోలు చేశాడు. ఈ నెల 26న రమేష్‌ను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి మెటల్‌కుంట గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ రమేష్‌కు మద్యం తాగించి మత్తులోకి దించిన అనంతరం అతడి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించి, కత్తితో పలుమార్లు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.ఈ నెల 28న మెటల్‌కుంట గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి ఇందిరా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించాయి. జహీరాబాద్ రూరల్ సీఐ నర్సింలు పర్యవేక్షణలో హద్నూర్ ఎస్ఐ సుజిత్, పోలీసు సిబ్బంది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఇతర ఆధారాల ఆధారంగా కేవలం నాలుగు గంటల్లోనే నిందితులను గుర్తించారు. ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, రమేష్‌ను తామే హత్య చేసినట్లు అంగీకరించారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ నర్సింలు, ఎస్ఐ సుజిత్, పోలీసు సిబ్బంది, క్రైమ్ సిబ్బంది ఓందేవ్, అస్లాంలను డీఎస్పీ సైదా నాయక్ ప్రత్యేకంగా అభినందించారు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన భార్య.. నాలుగు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి