అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని బాధితుల ఆరోపణ.
ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 23: స్థానికం ప్రతినిధి:
తమకు చెందిన 33 ఎకరాల 04 గుంటల భూమిని అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తున్న వారిపై విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని బొందుగుల గ్రామానికి చెందిన డొంకెన భాస్కర్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి విజ్ఞప్తి చేశారు. సోమవారం భువనగిరి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో బాధితులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.
రాజాపేట మండలం నమిలే గ్రామ శివారులోని సర్వే నంబర్లు 67 నుంచి 74 వరకు ఉన్న తమ భూమిని 2018లో పులి సత్యనారాయణ, చంద్రమౌళిలకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) ఇచ్చామని, అనంతరం దానిని రద్దు చేసుకున్నామని బాధితులు తెలిపారు. అయినప్పటికీ కొందరు దొంగ సంతకాలు, తప్పుడు పత్రాలు, పట్టాలు సృష్టించి భూమిని ఇతరులకు విక్రయిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయమై పలుమార్లు తహసీల్దార్‌కు, భూభారతి ద్వారా ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో కుమ్మక్కై అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, భూమి రికార్డులను సమగ్రంగా పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
అక్రమ కబ్జాదారుల నుంచి తమ భూమిని కాపాడి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డొంకెన విట్టలయ్య, డొంకెన ఆనందం, ఈశ్వర్, వీరాస్వామి, శ్రీనివాస్, దోడల రాములు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి