ప్రపంచ శాంతి కోసం ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలి.
రంగారెడ్డి జిల్లా మహాసభలో వక్తల పిలుపు
రంగారెడ్డి: ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, అశాంతి వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధాలు లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి, మానవ హక్కుల పరిరక్షణ, దేశాల సార్వభౌమాధికారానికి గౌరవం, ప్రజాస్వామ్య, లౌకిక విలువల పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం రంగారెడ్డి జిల్లా మహాసభ ఆదివారం టీఎన్జీవో భవన్లో తిప్పర్తి మహేష్, పల్లె వినయ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభను ప్రారంభించిన సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అనేక దేశాలు యుద్ధ భయంతో బతుకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ క్షణంలో యుద్ధాలు చెలరేగి దేశాలు, మానవ సమాజం అతలాకుతలం అవుతాయోనన్న ఆందోళన నెలకొందన్నారు. యుద్ధాలు లేని సమాజ నిర్మాణమే అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రపంచ శాంతి కోసం యూరప్ దేశాల్లో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. యుద్ధోన్మాదం, సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తమ గళాన్ని వినిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు ప్రజా ఉద్యమాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి