భక్తులకు తక్షణ వైద్య సహాయం,గాయపడిన ముగ్గురు భక్తులు చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
యాదగిరిగుట్ట: కార్తీక మాసోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లలో భాగంగా,ఆలయ మాడవీధుల ప్రాంగణంలో తాత్కాలిక వైట్ పెండల్ టెంట్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల నిర్వహణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేదా ఇబ్బంది కలగకుండా దేవస్థానం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పనులు జరుగుతున్న ప్రాంతానికి భక్తులు ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, తగిన భద్రతా చర్యల మధ్య ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పనులు చేపట్టడం జరిగింది. అయితే, అనూహ్యంగా ఒక్కసారిగా వీచిన బలమైన ఈదురుగాలుల ప్రభావంతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక టెంట్‌లోని ఒక భాగం పక్కకు ఒరిగింది. ఈ అనూహ్య పరిణామంలో ఆ సమయంలో సమీపంలో ఉన్న ముగ్గురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన దేవస్థానం సిబ్బంది ఎలాంటి జాప్యం లేకుండా క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, తదుపరి వైద్య సేవల నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. దేవస్థాన అధికారులు అక్కడే ఉండి వైద్యులతో సమన్వయం చేసుకుంటూ, బాధితులకు అవసరమైన వైద్య చికిత్స అందేలా తక్షణ చర్యలు తీసుకున్నారు.ఈ అనూహ్య ఘటనను దేవస్థానం యంత్రాంగం అత్యంత అప్రమత్తతతో పరిగణించి,భక్తుల భద్రతకు మరింత ప్రాధాన్యతనిస్తూ తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మాడవీధుల ప్రాంగణంలో ప్రతిపాదించిన టెంట్ ఏర్పాట్లను పునఃసమీక్షించి, వాతావరణ పరిస్థితులు మరియు బలమైన ఈదురుగాలుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కోటి పుష్పార్చన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను స్టేజీ ప్రాంతానికే పరిమితం చేయాలని నిర్ణయించింది. తద్వారా అనవసరమైన ప్రమాదాలకు ఆస్కారం లేకుండా, కార్యక్రమాన్ని సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన మార్పులు చేపట్టింది.
భక్తుల భద్రతే దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యత...
ఈ ఘటనలో చోటుచేసుకున్న పరిణామం అనూహ్యంగా వీచిన బలమైన ఈదురుగాలుల ప్రభావంతో సంభవించినదని,ఘటన అనంతరం దేవస్థానం యంత్రాంగం తక్షణమే స్పందించి బాధితులకు వైద్య సహాయం అందించడంతో పాటు,భద్రతాపరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టిందని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీకి తావులేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గాయపడిన ముగ్గురు భక్తులు ప చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు, కార్తీక మాసోత్సవాలు,కోటి పుష్పార్చన వంటి పవిత్ర కార్యక్రమాలను భక్తుల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా,ప్రస్తుత వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఏర్పాట్లను కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కావున,ఈ ఘటనపై భక్తులు ఎలాంటి ఆందోళనకు లేదా అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని,దేవస్థానం చేపట్టిన తక్షణ చర్యలు మరియు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై విశ్వాసం ఉంచాలని కోరారు. భక్తులు యథావిధిగా యాదగిరిగుట్టకు విచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
జి.శ్రీనివాస్ - సీనియర్ రిపోర్టర్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి