మహిళల ఆటపాటలతో మార్మోగిన కాలనీ.. భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ.
చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రావుల లక్ష్మి వెంకన్న ఆధ్వర్యంలో అత్యంత పెద్ద బతుకమ్మను వివిధ రకాల పూలతో అందంగా పేర్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
అనంతరం మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు.
ఈ వేడుకల్లో రెండో వార్డు కౌన్సిలర్ ఎస్కే షబానా అజీముద్దీన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆగు అశోక్ యాదవ్ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ షబానా అజీముద్దీన్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని పూజిస్తూ, పూలను ఆరాధించే ఈ పండుగ మహిళల్లో ఐక్యతను, ఆత్మీయతను పెంపొందిస్తుందని అన్నారు.
మహిళలంతా ఆనందోత్సాహాలతో బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
వెంకటేశ్వర కాలనీకి చెందిన మహిళలు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి