ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని లక్ష్యాన్ని సాధించాలి..
డిటిసిలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ శిబిరం పరిశీలన..
జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్..
నల్గొండ : పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధనతోనే పోటీ పరీక్షల్లో విజయకేతనం ఎగురవేయవచ్చని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (DTC)లో ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం వారు సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఉద్యోగ సాధనకు అవసరమైన పలు కీలక సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.
లక్ష్యంపైనే దృష్టి పెట్టాలి.. కలెక్టర్ బి.చంద్రశేఖర్
కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలను లక్ష్యంగా ఎంచుకున్న నిరుద్యోగ యువత కోసం పోలీస్ శాఖ ఉచితంగా శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే లక్ష్యంపైనే పూర్తి దృష్టి సారించాలన్నారు. శిక్షణ తరగతుల్లో బోధకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడంతో పాటు ప్రతిరోజూ సొంతంగా చదువుకోవడానికి సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు.
45 రోజుల పాటు 350 మందికి శిక్షణ.. ఎస్పీ శరత్ చంద్ర పవార్
జిల్లా కలెక్టర్ సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేంద్రంలో సుమారు 350 మంది యువతీ యువకులకు 45 రోజుల పాటు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. కేవలం తరగతులకు హాజరవడం మాత్రమే కాకుండా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదవడం, పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం, మాక్ టెస్టులు రాయడం మరియు సమయపాలన పాటించడం ఎంతో ముఖ్యామని పేర్కొన్నారు.
సందేహాలు ఉంటే వెంటనే శిక్షకులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, రాత పరీక్షలతో పాటు శారీరక దృఢత్వ పరీక్షల (ఈవెంట్స్) కోసం ప్రతిరోజూ వ్యాయామం, పరుగు సాధన చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ కలిసి శిక్షణ తరగతులను, అభ్యర్థులకు కల్పిస్తున్న వసతులను ప్రత్యక్షంగా పరిశీలించి అభ్యర్థులతో మాట్లాడారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డిటిసి డిఎస్పీ నగేష్, ఎస్బి సీఐ నాగరాజు, సీఐ కరుణాకర్, ఆర్ఐలు సంతోష్, హరిబాబు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మరియు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి