హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం: ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రూ. లక్ష విరాళమిచ్చిన ఆముదాల పరమేశ్
తెలంగాణ మట్టి బిడ్డల స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీ రాష్ట్రంలో ఆవిర్భవించిందని పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు.నల్గొండ_ఖమ్మం_వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా చౌటుప్పల్‌లో ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి సమావేశం జరిగింది.
సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1,200 మంది తెలంగాణ యువత బలిదానంతో ఏర్పాటైన రాష్ట్రంలో పదేళ్లపాటు పాలించిన బారాస ఇచ్చిన హామీలు అమలు చేయక ఫామ్‌హౌస్‌కే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చి మూడేళ్లయినా కనీసం 20 శాతం హామీలు కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నారని తెలిపారు. బారాస పదేళ్ల అరణ్యవాసం, కాంగ్రెస్ మూడేళ్ల అజ్ఞాతవాసం ముగిశాయని, అందుకే జనసేన రంగంలోకి దిగి గళమెత్తి ప్రశ్నిస్తోందని చెప్పారు. జనసేనతోనే తెలంగాణలో సామాజిక న్యాయం లభిస్తుందన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జనసేనకు సెమీఫైనల్స్ లాంటివని, పట్టభద్రులు ఆదరించి గెలిపించాలని కోరారు. పవన్ కళ్యాణ్ వస్తే ప్రళయం ఖాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదులో విశేష కృషి చేసిన నాయకులను సన్మానించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిమిత్తం జనసేన ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకుడు ఆముదాల పరమేశ్ రూ.1,00,000 చెక్కును సభా వేదికపై అందజేశారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు పట్టభద్రులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన తెలంగాణ జాయినింగ్ కమిటీ కన్వీనర్ మమ్ము రెడ్డి ప్రేమ్ కుమార్, నాయకులు మచ్చ సుధాకర్, శర్మ, శిరీష, ప్రజిత్ గౌడ్, మిర్యాల రామకృష్ణ, శివ కార్తీక్, లక్ష్మణ్ గౌడ్, పీక ప్రవీణ్, మామిడాల రమేష్, శ్రీకాంత్, లింగస్వామి, బద్రి రాజు, పాండు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి