నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై మండల సూపర్‌వైజర్ ఉమాకాంత్, లైన్‌మెన్ సంగ్రామ్ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి సింగూరు ప్రాజెక్టుకు చేరాల్సిన నీటి ప్రవాహం తగ్గిపోయిందని తెలిపారు. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గి తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించారు. నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఒకరోజు నీటిని సరఫరా చేసి, మరుసటి రోజు విరామం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి సింగూరు ప్రాజెక్టు నుంచి మరో ఒకటి లేదా రెండు నెలల వరకు మాత్రమే నీటి సరఫరా అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లామని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా కౌలాస్ ప్రాజెక్టు నుంచి నీటిని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సూపర్‌వైజర్ ఉమాకాంత్ వెల్లడించారు. నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని, తాగునీటిని వృథా చేయకుండా అవసరమైనంత మాత్రమే వినియోగించుకోవాలని, నీటి పొదుపులో ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
సింగూరులో తగ్గుతున్న నీటి నిల్వలు.. కంగ్టిలో ఒకరోజు విడిచి ఒకరోజు తాగునీటి సరఫరా
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి