గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం కల్పించాలి: ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
చౌటుప్పల్ బస్టాండ్ ఆవరణలో విద్యార్థుల సంతకాల సేకరణ
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని మెరుగుపరచాలని, కళాశాల సమయాలకు అనుగుణంగా బస్సులు నడపాలని ఎస్‌ఎఫ్‌ఐ చౌటుప్పల్ మండల కమిటీ డిమాండ్ చేసింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం చౌటుప్పల్ బస్టాండ్ ఆవరణలో విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రతిరోజూ మండలంలోని వివిధ గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్థులు చౌటుప్పల్‌లోని విద్యాసంస్థలకు వస్తుంటారని తెలిపారు. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో సమయానికి కళాశాలలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మందోళ్లగూడెం - చౌటుప్పల్ ఈ మార్గంలో బస్సు సర్వీసును శాశ్వతంగా నడపాలి.
గట్టుప్పల్ నుంచి విద్యార్థులకు సరిపడా రవాణా లేకపోవడంతో అదనపు బస్సులు వేయాలి. మునుగోడు నుంచి చౌటుప్పల్ వచ్చే బస్సుల సంఖ్యను పెంచాలి.
చండూరు నుంచి వచ్చే విద్యార్థులకు కళాశాల వేళలకు అనుగుణంగా బస్సులు వేయాలి. అలాగే చౌటుప్పల్ నుంచి నల్గొండకు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచాలి.
"ప్రభుత్వం మహిళలు, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడపకపోతే ఆ పథకం వల్ల పేద విద్యార్థులకు ప్రయోజనం ఉండదు. కేవలం పథకాలు ప్రకటించడమే కాకుండా క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి పరిష్కరించాలి."
జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంటనే స్పందించి విద్యార్థులు ఉన్న గ్రామాలను గుర్తించి అదనపు బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని, విద్యార్థుల సమస్యలు తీరేవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల సహాయ కార్యదర్శి సాతిరి మనోజ్ కుమార్, ఉపాధ్యక్షుడు ఇరిగి వరుణ్ తేజ్, నాయకులు వెలిజాల సాయి, రామ్ చరణ్, మనోహర్, సాయి, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి