చింతలకుంట ఎల్‌పీటీ మార్కెట్ సర్వీస్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మిస్తున్న సులభ్ కాంప్లెక్స్ పనులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రజల సౌకర్యార్థం బస్‌స్టాప్ వద్ద సులభ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రత, దుర్వాసన ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా సర్వీస్ రోడ్డుపై నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. స్థానిక ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ను పిలిపించి ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు.
అనంతరం సమీపంలోని సింధూర్ ఎన్‌క్లేవ్ కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి కాలనీలోకి వెళ్లేందుకు ప్రత్యేక రహదారి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి