షటర్లు నిర్మించి.. గుర్తింపు కార్డులు జారీ చేయాలి
ఎర్రుపాలెం: రోడ్డు విస్తరణ పనులతో చిరు వ్యాపారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు డిమాండ్ చేశారు. ఎర్రుపాలెం నాలుగు రోడ్ల విస్తరణ పనులను తాము వ్యతిరేకించడం లేదని, అయితే దశాబ్దకాలంగా రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరారు.
పండ్లు, పూలు, టిఫిన్, టీ, ఫాస్ట్‌ఫుడ్, కూరగాయలు, బడ్డీలు, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న పలువురు రోడ్డు విస్తరణతో ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు మార్కింగ్ చేసి దుకాణాలను తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారని, వ్యాపారాలు తొలగిస్తే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
వీధి వ్యాపారులను చట్ట ప్రకారం గుర్తించి గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లు జారీ చేసి రక్షణ కల్పించాలని కోరారు. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించే ముందే మండల కేంద్రంలోని ప్రధాన రింగ్ సెంటర్ (చౌరస్తా) వద్ద చిరు వ్యాపారులకు స్థలం కేటాయించి గదులు నిర్మించి షటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు, కార్మికుల జీవనోపాధికి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో దూదిగం బసవయ్య, దివ్వెల వీరాంజనేయులు, నక్కా పుల్లారావుతో పాటు పలువురు చిరు వ్యాపారులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి