నకిరేకల్: రానున్న ఖరీఫ్ వడ్ల కొనుగోలు సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. శుక్రవారం పన్నాలగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఖరీఫ్ వడ్ల కొనుగోళ్లపై ముందస్తు ప్రణాళికా సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో నల్గొండ జిల్లా డీసీఓ, నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంఆర్‌ఓలు, పీఏసీఎస్ సీఈఓలు, ఐకేపీ డీపీఎం, ఏపీఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గం అత్యధికంగా వరి సాగయ్యే ప్రాంతమని, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులను ముందుగానే సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు ఆలస్యం కాకుండా 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని, దళారుల ప్రమేయానికి తావులేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి