వార్షిక తనిఖీల్లో భాగంగా మల్టీ జోన్–2 ఐజీ షానవాజ్ ఖాసిం, ఐపీఎస్ సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఐజీకి స్వాగతం పలికారు. అనంతరం ఐజీ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, జిల్లా ఎస్పీతో కలిసి ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆర్ఐ స్టోర్, మోటార్ వెహికల్ విభాగం, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ (బీడీ) టీమ్ విభాగాలను పరిశీలించి వాటి పనితీరు, నిర్వహణ, సిబ్బంది విధుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయుధాల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, విధుల సమయంలో బాడీ ప్రొటెక్టర్లు, హెల్మెట్లు, లాఠీలు వంటి రక్షణ పరికరాలను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. స్టోర్‌లోని సామగ్రిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ వినియోగానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పోలీసు వాహనాలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించి మంచి స్థితిలో ఉంచాలని, అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. డాగ్ స్క్వాడ్‌లోని జాగిలాల ఆరోగ్యం, ఆహారం, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వాటికి క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వడంతో పాటు ఆరోగ్య వివరాలు, రోజువారీ కార్యకలాపాలను రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. వర్షాకాలంలో వరదలు, చెరువులు, కుంటల వద్ద జరిగే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన రక్షణ పరికరాలు, భద్రతా కిట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అనంతరం పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ నిర్వహణ, రికార్డుల నిర్వహణతో పాటు అధికారులు, సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని ఐజీ ప్రశంసించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. అనంతరం డీఎస్పీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో తరచూ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు పోలీసు సేవలపై అవగాహన కల్పించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచి అవసరమైన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ముందస్తు సమాచార సేకరణతో పాటు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీలు చైతన్య రెడ్డి, శ్రీనివాస్ రావు, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, ప్రభాకర్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, సురేందర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస రావు, ఇన్స్పెక్టర్లు రమేష్, సదా నాగరాజు తదితరులు పాల్గొన్నా
రు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి